ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది: విజయశాంతి

  • హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ
  • స్పందించిన విజయశాంతి
  • కేసీఆర్ పై విమర్శలు
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై నేడు కూడా హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు. ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా కోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై అనుమానాలు కలుగుతున్నాయని, విపక్షాలు కార్మిక సంఘాల నేతలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నాయని అందులో ఆరోపించడం విడ్డూరంగా ఉందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పక్కన ఉన్నవారే కుట్రలు చేస్తుంటే ఆ విషయం బయటపెట్టలేక, విపక్షాల మీదకు ఆ నెపాన్ని నెట్టివేస్తున్నారని ఆరోపించారు.

టీఆర్ఎస్ కు చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వాళ్లు కేసీఆర్ పై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరతారని లక్ష్మణ్ ప్రకటించిన నేపథ్యంలో, నేరుగా బీజేపీ పేరును ప్రస్తావించే ధైర్యం లేక, విపక్షాలు కుట్రకు పాల్పడుతున్నాయంటూ కోర్టులో కేసీఆర్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. కుట్ర జరుగుతోందన్నప్పుడు ఆ కుట్రకు పాల్పడుతోంది ఎవరో ఎందుకు బయటపెట్టడంలేదని విజయశాంతి ప్రశ్నించారు. ఆ కుట్రలో మంత్రులకూ భాగం ఉంటే, ప్రభుత్వాన్ని కూల్చి సీఎం పీఠం దక్కించుకోవాలనుకుంటున్నది ఎవరు? అంటూ అడిగారు. దీనికి కేసీఆరే జవాబు చెప్పాలని పేర్కొన్నారు.

అయినా, ఏ కుట్రలు జరగకుండానే తెలంగాణలో విపక్షం అనేది లేకుండా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇప్పుడాయనే విపక్షాలు కుట్రలు చేస్తున్నాయనడం విస్మయం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Vijayasanthi
Telangana
TSRTC
TRS
KCR
High Court

More Telugu News